Maharashtra: వాడీవేడిగా మహారాష్ట్ర రాజకీయాలు... బీజేపీపై మండిపడుతున్న శివసేన
- మహారాష్ట్రలో తొలగని ప్రతిష్టంభన
- ఇంకా ఏర్పడని ప్రభుత్వం
- శివసేనకు గడువు విధించిన గవర్నర్
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. తొలుత బీజేపీ తలుపు తట్టిన రాష్ట్ర గవర్నర్, అక్కడినుంచి శివసేన వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ శివసేనను కోరారు. అందుకు ఇవాళ సాయంత్రం 7.30 గంటల వరకు గడువు విధించారు. అయితే దీనిపై శివసేన వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా ఈ పరిణామాలపై ఆరోపణలు చేస్తున్నాయి.
సోమవారం సాయంత్రంలోగా నిర్ణయం తెలపాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ గడువు విధించడం బీజేపీ కుట్రలో భాగం అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అంటున్నారు. తగిన సంఖ్యాబలం పొందేందుకు సమయం చాలక తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే, ఇదే అదనుగా రాష్ట్రపతి పాలన విధించాలన్నది బీజేపీ పన్నాగమని రౌత్ ఆరోపించారు. బీజేపీకి మూడు రోజుల సమయం ఇచ్చిన రాష్ట్ర గవర్నర్, తమకు కొద్ది సమయం మాత్రమే ఇవ్వడం బీజేపీ వ్యూహమేనని అన్నారు. గవర్నర్ తమకు మరింత సమయం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు తగిన ప్రయత్నాలు చేసుకునేవాళ్లమని రౌత్ తెలిపారు.