English Medium: ఇంగ్లీషు మీడియం మతమార్పిళ్లను ప్రోత్సహించేదైతే మీ పిల్లల్నెందుకు చదవించారు?: కన్నాపై సీపీఐ రామకృష్ణ విమర్శలు
- చర్చనీయాంశంగా మారిన ఇంగ్లీషు మీడియం
- అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం
- స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ఏపీలో ఇంగ్లీషు మీడియం వ్యవహారం పెను చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలన్న తమ నిర్ణయాన్ని అధికార వైసీపీ సమర్థించుకుంటుండగా, టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ రోజు విమర్శించారు. అయితే, కన్నా వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శలు చేశారు.
ఇంగ్లీషు మీడియం చదువులు మతమార్పిళ్లను ప్రోత్సహిస్తాయని కన్నా అనడం సరికాదని హితవు పలికారు. ఇంగ్లీషు మీడియం మతమార్పిళ్లను ప్రోత్సహించేదే అయితే మీ పిల్లల్నెందుకు ఇంగ్లీషు మీడియంలో చదివించారని కన్నాను ప్రశ్నించారు. అంతేకాకుండా సీఎం జగన్ వ్యాఖ్యలపైనా స్పందించారు. జగన్ విపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.