Vijay: తమిళ హీరో విజయ్ ని రాజకీయాల్లోకి దించే ప్రయత్నాల్లో ప్రశాంత్ కిశోర్!
- విజయ్ కి 28 శాతం ప్రజల మద్దతు
- గెలిపించే బాధ్యత నాది
- సీఎంను చేస్తానని విజయ్ కి చెప్పిన ప్రశాంత్ కిశోర్
తమిళనాట ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాజకీయ వ్యూహకర్తగా, నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్, వైఎస్ జగన్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు విజయం సాధించడానికి తన వంతు సహకారాన్ని అందించిన ప్రశాంత్ కిశోర్ కన్ను ఇప్పుడు హీరో విజయ్ పై పడిందట. తొలుత కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి సహకరించేందుకు అంగీకరించిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చూస్తున్నారట.
ఇదే సమయంలో తమిళనాడులో తన బృందంతో సర్వే చేయిస్తే, విజయ్ కి 28 శాతం మంది ప్రజల ఆదరణ ఉన్నట్టు తెలిసిందట. దీంతో ప్రశాంత్ కిశోర్ స్వయంగా విజయ్ ని కలిసి, ఈ విషయంలో చర్చలు జరిపినట్టు తమిళ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తే, గెలిపించేందుకు తనవంతు కృషిని చేస్తానని కూడా ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో వచ్చే ఏడాది సమయంలో గెలుపు కోసం తాను అనుసరించవలసిన పథకాల పైనా విజయ్ కి ఆయన వివరించారని తెలుస్తోంది. కేవలం వాటిని అమలు చేస్తే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు సమాచారం.
తమిళనాడు ప్రజలు విజయ్ కి అనుకూలంగా ఉన్నారని తమ సర్వేలో వెల్లడైనట్టు ప్రశాంత్ కిశోర్ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో యువనేత అయిన వైఎస్ జగన్ సీఎం అయినట్టుగానే, తమిళనాట విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రశాంత్ కిశోర్ నమ్ముతున్నారట. ఇదిలావుండగా, ప్రశాంత్ కిశోర్ చెప్పిన మాటలను విన్న విజయ్ ఎటువంటి నిర్ణయాన్నీ వెల్లడించలేదని, మరో ఐదేళ్ల పాటు తనకు రాజకీయ ప్రవేశం ఇష్టం లేదని చెప్పినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.