Maharashtra: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన బీజేపీ, శివసేన, ఎన్సీపీ
- రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసిన గవర్నర్
- కేంద్ర కేబినెట్ ఆమోదంతో అమల్లోకి రానున్న రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు ఊహించిన విధంగానే శుభం కార్డ్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ... ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ... ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో... రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. గవర్నర్ సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.