KCR: 'మిషన్ భగీరథ'పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తుంటే, కేంద్ర మంత్రి ఎలా ప్రశంసిస్తారు?: భట్టి ఆగ్రహం
- సీఎం కేసీఆర్ తో కేంద్రమంత్రి షెకావత్ భేటీ
- టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం ఏంటని నిలదీసిన భట్టి
- మిషన్ భగీరథ అవినీతి పంకిలం అంటూ వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ తో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ అయిన నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. 'మిషన్ భగీరథ' పథకం ఓ స్కాం అని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటే, అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి షెకావత్ 'మిషన్ భగీరథ' బాగుందంటూ ఎలా ప్రశంసిస్తారని మండిపడ్డారు.
"మిషన్ భగీరథలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారు. అలాంటిది, కేంద్ర మంత్రి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏమైనా ఒప్పందం కుదిరిందా? ఎంతో అవినీతి చోటు చేసుకున్న ఓ పథకాన్ని దేశవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారు? రాష్ట్ర బీజేపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి" అంటూ భట్టి ధ్వజమెత్తారు.