Thaikwando Athlet Saritha Murder: హర్యానాలో తైక్వాండో క్రీడాకారిణి హత్య... కోచ్ పై అనుమానం!
- కోచ్ హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
- హత్య తర్వాత కనిపించకుండాపోయిన కోచ్
- హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
హరియాణాకు చెందిన 25 ఏళ్ల తైక్వాండో క్రీడాకారిణి సరిత హత్యకు గురైంది. ఈరోజు మధ్యాహ్నం గురుగ్రామ్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్య వెనక కోచ్ హస్తం ఉందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కోచ్ పలుమార్లు ఆమె వెంటపడ్డాడని, అందుకామె తిరస్కరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు.
2013 నుంచి సరితకు ఆ కోచ్ తెలుసని వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతురాలిని సరితగా గుర్తించారు. ఓ యువకుడు కాల్పులు జరిపి పారిపోయినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఈ ఘటన తర్వాత కోచ్ కనిపించకుండా పోవడంతో.. అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.