Kishan Reddy: హైదరాబాద్ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన నగరం విశాఖ!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- విశాఖలో కిషన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం
- అమిత్ షా వద్ద పనిచేయడం సంతోషంగా ఉందని వెల్లడి
- ఉగ్రవాదులపై రాజీపడబోమని పునరుద్ఘాటన
విశాఖపట్నంలో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తనకు హైదరాబాద్ తర్వాత అత్యంత ఇష్టమైన నగరం విశాఖపట్నం అని చెప్పారు. కేంద్రంలో అమిత్ షా వద్ద పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత ఐదేళ్లలో హైదరాబాదులో కర్ఫ్యూ లేదు, బాంబు పేలుళ్లు లేవని తెలిపారు. ఉగ్రవాదులపై రాజీపడేది లేదని మెల్బోర్న్ సదస్సులో ప్రకటించామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పాక్ చంపే దేశం, భారత దేశస్తులు చనిపోయే వారనే అభద్రతా భావం తొలగిపోయిందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు 42 వేల మంది భారతీయులు చనిపోయారని వెల్లడించారు. బీజేపీ తొలి ఉద్యమం ఆర్టికల్ 370పైనే చేపట్టిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కాగా ఈ కార్యక్రమంలో అవంతి శ్రీనివాస్, ద్రోణంరాజు శ్రీనివాస్, సోము వీర్రాజు, హరిబాబు తదితర నేతలు పాల్గొన్నారు.