ISIS: ఐసిస్ కొత్త నేత కోసం వేట మొదలయ్యింది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- అతను ఎక్కడ ఉన్నాడో ఇప్పటికే గుర్తించాం
- బాధ్యతలు స్వీకరించాక అతని పనిపడతాం
- రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ప్రకటన
ప్రపంచానికే పెనుసవాల్ గా మారిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ నేత అబు బకర్ ఆల్ బాగ్దాదీని మట్టుబెట్టిన అమెరికా, దాని కొత్త నేతను విడిచి పెట్టేది లేదని ప్రకటించింది. ఇప్పటికే వేట మొదలయ్యిందని, అతను ఎక్కడ దాక్కున్నాడో కూడా గుర్తించామని, బాధ్యతలు స్వీకరించిన వెంటనే పనిపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు ఐసిస్ నేత గురించి అగ్రరాజ్యం ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీంతో ఐసిస్ కొత్త నేతనూ అంతమొందించేందుకు అమెరికా కృతనిశ్చయంతో ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.