israel: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఉగ్రవాది అబు కుటుంబంతో పాటు మరో 10 మంది మృతి
- మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
- ఇరాన్ సాయంతో ఇస్లామిక్ జీహాద్ ప్రతీకార చర్యలు
- ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు
- దేశ భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటామన్న నెతన్యాహు
గాజా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడితో విరుచుకుపడింది. పాలస్తీనియన్ ఉగ్రసంస్థ ఇస్లామిక్ జీహాద్ నాయకుడు బాహా అబు అల్ అట్టా లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది. దీంతో అబుతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమారులు హతమయ్యారు.
ఈ దాడిలో మరో 10 మంది మృతి చెందడమే కాకుండా మరో 25 మంది గాయాలపాలయ్యారు. దీంతో ఇరాన్ సాయంతో ఇస్లామిక్ జీహాద్ ప్రతీకార చర్యలకు పాల్పడింది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈజిప్టు రాజధాని కైరోకు ఐక్యరాజ్యసమితి మిడిల్ ఈస్ట్ రాయబారి వెళ్లారు.
ఈ పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ... ఇస్లామిక్ జీహాద్ నాయకుడు బాహా అబు అల్ అట్టా పెను ప్రమాదంగా మారాడని, గాజా-ఇజ్రాయెల్ సరిహద్దులో రాకెట్లు, డ్రోన్లతో దాడులకు ప్రణాళికలు రచించాడని తెలిపారు. అందుకే ఈ దాడి చేశామన్నారు.
తమ దేశ భద్రత కోసం అన్ని చర్యలూ తీసుకుంటామని నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ దాడికి తాము తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్ జీహాద్‌తో పాటు మరో ఉగ్ర సంస్థ హమాస్ కూడా హెచ్చరించింది. కాగా, స్వతంత్ర ప్రాంతంగా ఉన్న పాలస్తీనియన్ రాజ్యం గాజాపై ఆధిపత్యం కోసం ఈ పోరు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.