Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఫేస్ బుక్ లో మారిన హోదా!
- ముఖ్యమంత్రి అని తీసేసి సంఘ్ సేవక్ గా నమోదు
- అసెంబ్లీ ఫలితాల అనంతరం కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగింపు
- తాజాగా రాష్ట్రపతి పాలనతో ఈ నిర్ణయం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవంద్ర ఫడ్నవీస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో హోదాను మార్చుకున్నారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి అని ఉండగా, తాజాగా 'సంఘ్ సేవక్' అని నమోదు చేసుకున్నారు. ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడిన మెజార్టీ రాని విషయం తెలిసిందే.
ఈ నెల 8వ తేదీతో అసెంబ్లీ గడువు ముగిసింది. ఈలోగా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అయితే తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరడంతో ఆయన కొనసాగారు. రాష్ట్రంలో తొలుత బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ పిలిచి 48 గంటల సమయం ఇచ్చారు. వారు అశక్తత వ్యక్తం చేయడంతో అనంతరం శివసేనకు, తర్వాత ఎన్‌సీపీని కోరారు.
ఫలితాలు వెలువడి మూడు వారాలు పూర్తయినా ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏ పార్టీల మధ్య పొత్తు సాకారం కాకపోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ట్విట్టర్ ఖాతాలో ఉన్న తన డిజిగ్నేషనను ఫడ్నవీస్ మార్చుకున్నారు.