suicide attempt: స్థలం విషయంలో అన్యాయం చేశారంటూ.. ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దంపతుల ఆత్మహత్యా యత్నం!
- పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ తో నిరసన
- పదేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన
- కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఘటన
ఓ స్థలం విషయంలో న్యాయం చేయాలంటూ పదేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడని, సమస్య పరిష్కరించే ప్రయత్నం చేయలేదన్న మనస్తాపంతో స్థల యజమాని దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుటే పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ పట్టుకుని తమ నిరసన తెలిపారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రెవెన్యూ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. బత్తలూరు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దంపతులకు ఉన్న ఓ స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఆ సమస్యను పరిష్కరించి భూమి తమకు అప్పగించాలంటూ సుబ్బారెడ్డి గడచిన పదేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఇక తమకు చావే శరణ్యమంటూ దంపతులు ఆత్మహత్యా యత్నం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.