Andhra Pradesh: రోజూ రెండు లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతాం!: మంత్రి పేర్ని నాని స్పష్టీకరణ
- రోజూ 2 లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతాం
- పది రోజుల్లో డిమాండ్ కు తగ్గట్టు ఇసుక సరఫరా
- కమిటీ సూచనలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్ మీడియంలో బోధన
ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో బోధనకు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలను వివరించారు. కమిటీ సూచనలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయాలని నిర్ణయించామని, అయితే, తప్పనిసరిగా మాతృభాష ‘తెలుగు’ ఒక సబ్జెక్టుగా ఉంటుందని వివరించారు.
ఇసుక నిల్వ చేసి, దాన్ని విక్రయించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. రోజూ రెండు లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని, పది రోజుల్లో డిమాండ్ కు తగ్గట్టుగా ఇసుకను సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని, ఆడిట్ నిర్వహిస్తామని, ఏపీ పర్యావరణ మేనేజ్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షలు అందజేస్తామని, సోలార్, పవన విద్యుత్ పాలసీలకు సవరణలు, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టానికి సవరణలు చేయాలని, గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు, ఎనిమిది ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు.