Andhra Pradesh: ఏపీలో నిర్భయంగా, నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టొచ్చు: మంత్రి అవంతి శ్రీనివాస్ భరోసా
- ఏపీలో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయన్నది అబద్ధం
- పరిశ్రమలు పెట్టేందుకు ఏపీ అన్నిరకాలుగా అనుకూలం
- ఏపీ బ్రాండ్ ఇమేజ్ తగ్గించుకునేలా దుష్ప్రచారాలు వద్దు
ఏపీలో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయంటూ ప్రతిపక్ష నేతలు విషప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టడానికి అన్నిరకాలుగా అనుకూలంగా వుందని అన్నారు.
ఈ విషయమై నిర్వహించే సమావేశాల్లో జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు, పోలీస్ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా చెబుతున్నారని గుర్తుచేశారు. పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని, ఎవరి వద్ద లంచాలు తీసుకోవద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలు తలదూర్చవద్దని, పారదర్శకంగా ఉండాలని, ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు తీసుకురావద్దని చెబుతూ, ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్న జగన్.. పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు తీసుకోరని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టదలచుకున్నవారు నిర్భయంగా, నిస్సంకోచంగా రావొచ్చని, వారి ఆస్తులకు, డబ్బులకు, పెట్టుబడులకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను తగ్గించుకునేలా దుష్ప్రచారాలు చేయొద్దని, ఈ రాష్ట్రం మన అందరిదీ అని మంత్రి అన్నారు.