Climate: మీ చెత్తంతా మా సముద్రంలోకి వస్తోంది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • భారత్, చైనాలు సముద్రంలో పారేసే చెత్త లాస్ ఏంజెల్స్ కు కొట్టుకొస్తోందన్న ప్రెసిడెంట్
  • కార్బన్ ఉద్గారాల్లో చైనా అమెరికాను మించిపోతోంది
  • మీ పారిశ్రామిక పొగ గొట్టాలను కూడా శుభ్రం చేసుకోలేకపోతున్నారని విమర్శ
భారత్, చైనాలు సముద్రంలో పారవేస్తున్న చెత్తంతా తమ దేశంలోకి కొట్టుకొస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పలు దేశాలు తమ దేశాల్లో వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. న్యూయార్క్ లో నిర్వహిస్తోన్న ఎకనమిక్ క్లబ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, వాతావరణం, పర్యావరణ మార్పులు, భూగోళ ఉష్ణోగ్రత పెరగటం తదితర అంశాలను ప్రస్తావించారు.

‘పర్యావరణ మార్పులు అన్న అంశం సంక్లిష్టమైనది. భూగోళంలో అమెరికా చాలా చిన్న ప్రాంతం. చైనా, భారత్, రష్యాలాంటి దేశాలు తమ ఉత్పత్తి కేంద్రాలను, పొగ గొట్టాలను శుభ్రంగా ఉంచుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. మరోవైపు సముద్రంలోకి ఆ దేశాలు చెత్తను డంప్ చేస్తున్నారు. అది కొట్టుకొచ్చి లాస్ ఏంజెల్స్ కు చేరుతోంది. దీనిపై ఎవరూ పట్టించుకోరు. పైపెచ్చు మనదేశం గురించే మాట్లాడతారు. పర్యావరణ పరిరక్షణకు అమెరికా ఏమి చేస్తుందోనంటూ దృష్టి సారిస్తారు’ అని అన్నారు.

అలాగే, కార్బన్ ఉద్గారాలను అమెరికాను మించి చైనా విడుదల చేస్తుందని ట్రంప్  అన్నారు. ప్రపంచంలో పరిశుభ్రమైన నీరు, గాలిని అమెరికా పొందుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి శుద్ధమైన నీరు, కాలుష్యంలేని వాతావరణాన్నే తాను కోరుకుంటానని ట్రంప్ చెప్పారు. కాగా, పర్యావరణ పరిరక్షణకు 188 దేశాలు చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు రేండేళ్ల క్రితం ట్రంప్ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020 నవంబర్ 4 నాటికి అమెరికా ఆ ఒప్పందం నుంచి పూర్తిగా బయటకు రానుంది.
Climate
Environment
Donald Trump
Comments
Waste Floating to America
Criticism on India and China

More Telugu News