america: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రారంభమైన అభిశంసన ప్రక్రియ
- జోబిడెన్‌ను పోటీ నుంచి తప్పించేందుకు ట్రంప్ యత్నం
- ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి సాయం కోరినట్టు అభియోగం
- విచారణ ప్రత్యక్ష ప్రసారం
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీదారుగా నిలవనున్న జోబిడెన్‌పై ఉక్రెయిన్ సాయంతో ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో బిడెన్‌కు ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపి, తనకు సాయం చేయాల్సిందిగా ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడు జెలెన్స్కీని కోరారని ట్రంప్‌పై అభియోగం నమోదైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అభిశంసనపై బుధవారం బహిరంగ విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటెలిజెన్స్ కమిటీ అధ్యక్షుడు, డెమొక్రాట్ పార్టీ నేత ఆడమ్ షిఫ్ ఈ బహిరంగ విచారణను ప్రారంభించారు. ఈ విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.
ట్రంప్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఉక్రెయిన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారా? అన్న ప్రశ్నతో విచారణ ప్రారంభమైంది. విచారణలో భాగంగా తొలుత ఉక్రెయిన్‌లో అమెరికా దౌత్యాధికారి టేలర్, డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ కెంట్లను ప్రశ్నించనున్నారు. ఉక్రెయిన్ నూతన అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ చేసిన ఫోన్ కాల్ ఆధారంగా విచారణ జరగనుంది.