Hyderabad: తల్లి పనిచేస్తున్న ఇంట్లోనే కన్నం వేసిన బాలుడు.. రూ.25 లక్షల చోరీ!
- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఘటన
- బీరువాలో పెట్టిన డబ్బులు చోరీ చేసి బాబాయికి
- అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించిన పోలీసులు
తన తల్లి పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి తెగబడ్డాడో బాలుడు. ఏకంగా రూ.25 లక్షలు కాజేశాడు. ఈ నెల 8న ఈ ఘటన జరగ్గా.. తాజాగా నిందితుడైన బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడలోని శారదానగర్‌లో నివసించే గోవర్థన్‌రెడ్డి స్టీల్, సిమెంట్ వ్యాపారి.
ఆ అపార్ట్‌మెంట్‌కు కాపలాదారుగా ఉండే ఓ కుటుంబం సెల్లార్లో నివసిస్తోంది. వారికి ఓ కుమారుడు (16) ఉన్నాడు. అతడి తల్లి గోవర్థన్ ఇంట్లో పని చేస్తోంది. ఈ క్రమంలో తల్లితో కలిసి అతడి ఇంటికి వెళ్లే బాలుడు వారికి బాగా దగ్గరయ్యాడు. గోవర్థన్‌రెడ్డి ఇటీవల 25 లక్షల రూపాయలు తెచ్చి బీరువాలో పెట్టాడు. గమనించిన బాలుడు వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలోని రూ.25 లక్షలు తీసుకుని సమీపంలో నివసించే తన బాబాయికి తీసుకెళ్లి ఇచ్చాడు.
డబ్బులు అవసరమైన గోవర్థన్ ఈ నెల 8న బీరువా తెరిచేందుకు ప్రయత్నించగా తాళం చెవి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన బీరువా పగలగొట్టి చూసి షాకయ్యాడు. లోపల తాను పెట్టిన రూ.25 లక్షలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానంతో సెక్యూరిటీగార్డు కుమారుడిని ప్రశ్నించగా బండారం బయటపడింది. ఆ సొమ్మును తానే దొంగిలించినట్టు అంగీకరించాడు. అతడి నుంచి రూ.24.70 లక్షలు స్వాధీనం చేసుకుని జువైనల్ హోంకు తరలించారు.