Health: కొంపముంచిన అత్యుత్సాహం.. రోగులను పంపాలంటూ ప్రకటన ఇచ్చిన ఆసుపత్రి సీజ్ !
- రాజమండ్రిలోని 'ఎస్' ఆసుపత్రి నిర్వాకం
- వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ ప్రాక్టీషనర్లకు ఆఫర్
- వివాదం కావడంతో ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
వైద్యం వ్యాపారంగా మారిపోయిందని ఇప్పటికే జనం గగ్గోలు పెడుతున్నారు. ఏదైనా సమస్య కారణంగా ఆసుపత్రిలోకి అడుగు పెడితే కొందరు నిర్వాహకులు రోగుల్ని జలగల్లా పీడిస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ ఆసుపత్రి యాజమాన్యం వార్షికోత్సవం సందర్భంగా చూపించిన అత్యుత్సాహం, అతి తెలివి ఎదురు తిరిగి ఆసుపత్రి మూతపడేందుకు కారణమైంది.
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 'ఎస్' అనే ప్రైవేట్ ఆసుపత్రి నడుస్తోంది. యాజమాన్యం ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ ప్రాక్టీషనర్లకు ఓ ఆఫర్ ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఎవరైనా మెడికల్ ప్రాక్టీషనర్ ఐదుగురు రోగులను తమ ఆసుపత్రికి పంపిస్తే వెయ్యి రూపాయలు, పది మందిని పంపితే రూ.2 వేలు, 15 మందిని పంపితే రూ.3 వేలు, 25 మందిని పంపితే రూ.6 వేల గిఫ్ట్ కార్డులు అందిస్తామన్నది ఆ ప్రకటన సారాంశం. వీటికి హోప్ ఫుల్ 5, హోప్ ఫుల్ 10, లవ్లీ, లక్కీ ఆఫర్లంటూ పేర్లు కూడా పెట్టింది. ఆసుపత్రి యాజమాన్యం జారీ చేసిన ఈ ప్రకటన కాస్తా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో వివాదాస్పదమైంది.
నెటిజన్లు మండిపడడంతో విషయం కాస్తా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు విచారణ జరిపించి ఆసుపత్రిని మూసి వేయించారు. ఆసుపత్రి వైద్యుడు నిఖిల్ నుంచి వివరణ తీసుకున్నారు. కాగా, ఈ అంశంపై వైద్య మండలి చైర్మన్ సాంబశివారెడ్డి మాట్లాడుతూ 'ఈ ప్రకటన వైద్య వృత్తిని దిగజార్చేలా ఉంది. అందువల్ల యాజమాన్యానికి నోటీసు ఇస్తాం' అని స్పష్టం చేశారు.