Narendra Modi: మూడు కీలక కేసులపై నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు.. సర్వత్ర ఉత్కంఠ!
- శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపైనా
- రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపైనా
- ‘చౌకీదార్ చోర్ హై’ విమర్శలపైనా తీర్పులు వెలువరించనున్న సుప్రీంకోర్టు
సంచలన తీర్పులతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు మరోమూడు కీలక కేసుల్లో తీర్పు చెప్పబోతోంది. దీంతో మరోమారు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీం తీర్పు చెప్పనున్న మూడు కేసుల్లో ఒకటి శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కాగా, రెండోది రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంపైన. మూడోది.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ అన్న విమర్శలపైనా తీర్పు ఇవ్వనుంది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ గతేడాది సెప్టెంబరు 28న ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన 65 పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని నరేంద్రమోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపైనా నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇక, రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శతవిధాలా ప్రయత్నించారు. ఈ క్రమంలో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శను రాహుల్ సుప్రీంతీర్పుకు ఆపాదించడంపైనా నేడు కోర్టు తీర్పు వెలువరించనుంది.