sand scarcity: వైసీపీ ప్రభుత్వం ఇసుక నూతన విధానం ఆర్భాటమే: జనసేన నేత నాదెండ్ల మనోహర్
- ఇసుక కొరతతో పనుల్లేక కూలీలు అల్లాడిపోతున్నారు
- వారి ఆత్మహత్యలు చూస్తుంటే బాధేస్తోంది
- మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఎదురవుతున్న పరిణామాలు ఒకలా ఉంటే, వైసీపీ ప్రభుత్వం తీరు మరోలా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక నూతన పాలసీ అంతా ఆర్భాటమే తప్ప పేదలకు ఉపయోగపడేలా లేదని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇసుక దీక్ష నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చూస్తుంటే మనసు కలచి వేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకుని ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.
పనుల్లేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, పనుల్లేని కాలానికి నెలకు రూ.10 వేలు చొప్పున కార్మికులకు భృతి అందించాలన్నారు . ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిందితులకు జైలు శిక్ష, జరిమానా మంచి నిర్ణయమేనని, కానీ దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు.