Telugudesam: పరిపాలనా దక్షత లేని వాళ్లు పరిపాలిస్తే ఇలాగే ఉంటుంది: వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాపాక ధ్వజం
- చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతున్నాం
- బాబు ఎంతో పరిపాలనా దక్షత గలవారు
- కార్మికుల ఆత్మహత్యలకు కారణం వైసీపీ ప్రభుత్వమే
ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు తమ మద్దతు తెలుపుతున్నట్టు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు చేపట్టిన నిరాహారదీక్ష శిబిరానికి వెళ్లి తమ సంఘీభావాన్ని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ, పరిపాలనా దక్షత లేకుండా పరిపాలిస్తే ఏవిధంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోందంటూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఎంతో పరిపాలనా దక్షత గలవారు కనుకనే ఆ రోజున ఉచిత ఇసుకను ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు.
చంద్రబాబు హయాంలో ఒక ట్రాక్టర్ ఇసుకకు తీసుకున్న దాని కంటే ఎక్కువగా ఈరోజున తీసుకుంటున్నారని, అలా వసూలు చేసిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం నాయకుడికి ఉందని, భారీ మెజార్టీతో వైసీపీని ప్రజలు గెలిపిస్తే ఈరోజున మీరు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. ఏ ప్రజలు అయితే ఎన్నుకున్నారో వారిని రోడ్డున పడేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణం ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరేనని దుయ్యబట్టారు. కొత్త ఇసుక పాలసీ తీసుకురావడానికి నాలుగు నెలల సమయం పట్టిందని, అదే, మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు ఒక్క రోజు కూడా పట్టలేదని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. మద్యం దుకాణం ఒక్కరోజు అయినా ఆగిందా? అని ప్రశ్నించిన రాపాక, ఇసుక మాత్రం నాలుగు నెలలుగా అందకుండా పోయిందని ధ్వజమెత్తారు.
ప్రజల గురించి, వారి సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఘాటు విమర్శలు చేశారు. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు ప్రజల్లోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని, కొత్త ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం, ఆ ఉద్యోగాలను ఇచ్చుకుంది వైసీపీ కార్యకర్తలకు కాదా? అని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయిన చంద్రబాబు, డెబ్బై సంవత్సరాల వయసులో కూడా దీక్షకు దిగారని అన్నారు. తమ తరఫున పోరాడుతున్న వారిని ప్రజలు ఎప్పుడూ మరిచిపోరని, వారి మనసుల్లో దాచుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే ప్రజలందరూ రోడ్డెక్కుతారని, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని సూచించారు.
అంతకుముందు, జనసేన పార్టీ నేత శివశంకర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై చేసే పోరాటాలకు, దీక్షలకు తమ పార్టీ సంఘీభావం ఉంటుందని, అందుకనే, చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షకు తమ మద్దతు తెలిపామని అన్నారు.