Chandrababu: ఆ తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ కనబడ్డాడా? ఆయన్ని ఎవరు ఆపేశారు?: వల్లభనేని వంశీ
- 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు
- ఆ తర్వాత ఎప్పుడైనా కనబడ్డాడా?
- అందుకు కారణమేంటి?
తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీని ప్రాంతీయ పార్టీగా అన్న ఎన్టీఆర్ స్థాపించినప్పటికీ జాతీయపార్టీలా ఆయన హయాంలో వెలిగిందని అన్నారు. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికకు ముందు ఒకమాట, ఆ తర్వాత మరోమాట మాట్లాడుతున్నామని, దీని మూలంగా పార్టీపై ప్రజల్లో ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోందని అన్నారు.
ఉదాహరణకు 2004లో 47 సీట్లకే పరిమితమయ్యామని, 2009లో ఏటీఎం కార్డులు పంచామని, అప్పుడు 90 సీట్లు రావడంతో ప్రతిపక్షంగానే మిగిలిపోయామని అన్నారు. 2009 ఎన్నికల్లో హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారని, ఆ తర్వాత ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ కనబడ్డాడా? అందుకు కారణమేంటి? ఎవరు ఆపేశారు ఆయన్ని? పది సంవత్సరాల క్రితం తన కెరీర్ ని జూనియర్ ఎన్టీఆర్ పణంగా పెట్టి టీడీపీ కోసం ప్రచారం చేసిన ఆయన ఎందుకు కనబడలేదు? ఎందుకు నల్లపూస అయిపోయాడు? అని ప్రశ్నించారు.