Telangana: విలీన అంశంపై వెనక్కి తగ్గిన టీఎస్ ఆర్టీసీ జేఏసీ!
- చర్చల కోసమే తాత్కాలికంగా ఈ అంశాన్ని వాయిదా వేశామన్న అశ్వత్థామరెడ్డి
- ఇకనైనా ప్రభుత్వం చర్చలకు రావాలంటూ డిమాండ్
- సమస్యలు పరిష్కారమయ్యేవరకు సమ్మె కొనసాగింపునకు నిర్ణయం
తెలంగాణలో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలన్న డిమాండ్ ను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయం చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ పొలిటికల్ జేఏసీ ఈ రోజు సాయంత్రం భేటీ అయింది. ఈ మేరకు వివరాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు వెల్లడించారు.
41 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. 23 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. సమ్మె కొనసాగిస్తామంటూ.. రేపటి నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణను ప్రకటించారు. రేపు రాష్ట్రాల్లోని గ్రామాల్లో బైక్ ర్యాలీలు చేపడతామని తెలిపారు. ఎల్లుండి అన్ని డిపోలనుంచి బైక్ ర్యాలీలు, 17, 18న డిపోల ముందు సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.
19న హైదరాబాద్ టు కోదాడ సడక్ బంద్ కార్యక్రమం చేపడతామని అన్నారు. చనిపోయిన, గాయపడ్డ ఆర్టీసీ కుటుంబాలతో కలిసి రెండు మూడు రోజుల్లో గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. అరెస్టు చేసిన జేఏసీ నేత కృష్ణారెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.