Vijayawada: చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం: చంద్రబాబునాయుడు
- ఎవరికి తోచినంత వారు విరాళాలు అందించాలి
- పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
- తక్షణం స్పందించి విరాళాలిచ్చిన పార్టీ శ్రేణులు
ఏపీలో ఇసుక కొరత కారణంగా పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కార్మికులను తాము ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎవరికి తోచినంత వారు విరాళాలు అందించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. చంద్రబాబు పిలుపు మేరకు తక్షణం స్పందించిన పార్టీ శ్రేణులు తమకు తోచిన సాయాన్ని విరాళంగా అందజేశాయి. ఈ దీక్షకు వచ్చి సంఘీభావం ప్రకటించిన బాధితులను చంద్రబాబు పరామర్శించారు.
ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను కట్టడి చేసి, ఉచితంగా ఇసుకను ఇవ్వాలని అన్నారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ చేస్తున్న వ్యక్తిగత విమర్శలను చంద్రబాబు ఖండించారు. జనసేన నాయకుడు లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? అని మండిపడ్డారు. ఇలా విమర్శలు చేసే వారిని వ్యక్తిగతంగా దూషిస్తే తట్టుకోగలరా? అని ప్రశ్నించారు. విమర్శలు చేయడం కాదు ప్రజలకు మేలు చేసే ఆలోచనలు చేయాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు.