heaat attack: డ్రైవింగ్ లో ఇలా చేస్తే గుండెపోటు ముప్పు తగ్గుతుందట!
- సంగీతం వింటూ డ్రైవింగ్ చేసే వారిలో గుండెపై తగ్గిన ఒత్తిడి
- సావోపాలో వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
- 18-23 ఏళ్ల అమ్మాయిలపై పరిశోధన
గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. గుండెపోటు ముప్పును తగ్గించేందుకు బ్రెజిల్‌లోని సావోపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ఫలితాన్ని ఇచ్చింది. సంగీతం వింటూ డ్రైవింగ్ చేసే వారిలో గుండెపోటు ముప్పు తగ్గుతుందని వీరు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా వారంలో ఒకటిరెండుసార్లు డ్రైవింగ్ చేసే 18-23 ఏళ్లలోపు ఐదుగురు మహిళలను ఎంపికచేసి వారిపై ఈ ప్రయోగం చేపట్టారు.
పరిశోధనలో భాగంగా తొలిరోజు రద్దీ మార్గంలో 20 నిమిషాలపాటు వారితో డ్రైవింగ్ చేయించారు. తర్వాతి రోజు కారులో సంగీతం వినిపిస్తూ డ్రైవింగ్ చేయించారు. ఈ సందర్భంగా వారి గుండె కొట్టుకునే వేగాన్ని పరిశీలించేందుకు చాతీ భాగంలో ఓ మానిటర్‌ను ఏర్పాటు చేశారు. కేవలం డ్రైవింగ్ మాత్రమే చేస్తున్నప్పటి కంటే, సంగీతం వింటూ డ్రైవింగ్ చేసే వారిలో నాడీ వ్యవస్థ, గుండెపై ఒత్తిడి తగ్గినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా వీరిలో గుండె పోటు ముప్పు రేటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.