Pakistan: పారిస్ లో జరుగుతున్న యూనెస్కో సమావేశాల్లో పాకిస్థాన్ ను ఉతికి ఆరేసిన భారత్
- పాకిస్థాన్ విఫల దేశం స్థాయికి పడిపోయింది
- ఇతర దేశాలను హెచ్చరించేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను వాడుకుంటోంది
- మైనార్టీల సంఖ్య 23 నుంచి 3 శాతానికి పడిపోయింది
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతున్న యునెస్కో సమావేశాల్లో పాకిస్థాన్ ను భారత్ ఎండగట్టింది. ఈ సమావేశాల్లో భారత బృందానికి నాయకత్వం వహిస్తున్న అనన్య అగర్వాల్ మాట్లాడుతూ, పాకిస్థాన్ డీఎన్ఏలోనే టెర్రరిజం ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, మనో దౌర్భల్యంతో బాధపడుతున్న ఆ దేశం విఫల దేశ స్థాయికి పడిపోయిందని అన్నారు. అన్ని రకాలుగా ఆ దేశం చీకటిలో మగ్గుతోందని చెప్పారు.
తీవ్రవాదులకు, సంఘ విద్రోహశక్తులకు ఆ దేశం ఓ స్థావరంలా తయారైందని అనన్య అన్నారు. యునెస్కోను తప్పుగా ఉపయోగించుకుంటూ... భారత్ పై విషం కక్కేందుకు పాక్ చేస్తున్న ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. 2018లో విడుదల చేసిన అత్యంత సులువుగా పతనమయ్యే అవకాశం ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్ కు 14వ స్థానం దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు .
అణు యుద్ధం చేస్తామంటూ ఇతర దేశాలను హెచ్చరించేందుకు ఐక్యరాజ్యసమితి వేదికను పాకిస్థాన్ వాడుకుంటోందని అనన్య ఆరోపించారు. సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు తలపడితే... వాటి పర్యవసానాలు సరిహద్దులను దాటి వెళతాయని హెచ్చరించారని గుర్తు చేశారు. ఒసామా బిన్ లాడెన్, హక్కానీ నెట్ వర్క్ ను పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హీరోలుగా కీర్తించారని తాను చెబితే... ఇక్కడున్న వారంతా నమ్మగలరా? అని ప్రశ్నించారు.
1947లో పాకిస్థాన్ లో మైనార్టీలు 23 శాతం మంది ఉండేవారని... ఇప్పుడు వారి సంఖ్య కేవలం 3 శాతం మాత్రమే ఉందని అనన్య తెలిపారు. ప్రపంచం అంగీకరించలేని చట్టాలు, తీవ్ర ఒత్తిడి, దాడులతో క్రిస్టియన్లు, హిందువులు, సిక్కులు, అహ్మదీయులు, షియాలు, పష్తూన్లు, సింధీలు, బలోచీలను మతమార్పిడులకు పాల్పడే విధంగా చేశారని అన్నారు. లింగ వివక్ష, మహిళలపై దాడులు, యాసిడ్ దాడులు, బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, బలవంతపు మత మార్పిడులు తదితర సమస్యలు పాకిస్థాన్ ను పీడిస్తున్నాయని చెప్పారు.
సొంత దేశంలో మైనార్టీలపై జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడకుండా... భారత్ పై ఆ దేశం విషం కక్కుతోందని అనన్య మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి వేదికను ఏ దేశం కూడా దుర్వినియోగం చేయకుండా యునెస్కో మెంబర్ షిప్ చర్యలు తీసుకోవాలని కోరారు.