Train Accident: అమ్మను చూసేందుకు బయలుదేరిన ఆమెకు అదే ఆఖరి ప్రయాణమైంది!

  • మృతురాలిది మంచిర్యాల జిల్లా కేంద్రం
  • హైదరాబాద్ లోని  ప్రైవేటు కంపెనీలో  ఉద్యోగం
  • కుమార్తె కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు చావు వార్త

తల్లిదండ్రులను చూసేందుకు బయలుదేరిన కుమార్తెకు అదే ఆఖరి ప్రయాణమయింది. ఉద్యోగం రావడంతో ఇక తల్లిదండ్రులను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలన్న ఆమె కలలు చూసి విధికి కన్నుకుట్టింది. రైలు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. మిమ్మల్ని చూడడానికి వస్తున్నా అన్న కుమార్తె చావు వార్త తెలియడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.


వివరాల్లోకి వెళితే...తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కోట అనూష (20) ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆమె తల్లిదండ్రులు మంచిర్యాలలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి తండ్రి మనోహర్‌కు అనూష ఫోన్ చేసింది.

'అమ్మను చూసి చాలా రోజులైంది నాన్నా. చూడాలని ఉంది. అందుకే ఊరు వస్తున్నా' అంటూ తెలియజేసింది. దీంతో కూతురి రాకకోసం వెయ్యికళ్లతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాత్రికి రైలెక్కి మంచిర్యాలకు అనూష బయలుదేరింది. రైలు రఘు నాథపల్లి స్టేషన్ దాటాక ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడింది. అనూషపై నుంచి రైలు వెళ్లిపోవడంతో శరీరం ముక్కలైంది.

నిన్న ఉదయం రైల్వే సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనూష వద్ద లభించిన పాన్‌ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కూతురి రాకకోసం ఆనందంతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు ఆమె మరణ వార్త వినగానే షాక్ అయ్యారు. కన్నీటి పర్యంతమవుతూ కాజీపేటకు చేరుకున్నారు. ఒక్కగానొక్క కుమార్తెను విగత జీవిగా చూసి కుప్పకూలిపోయారు.

  • Loading...

More Telugu News