Galla Jaydev: ప్రపంచంలో ఎక్కడైనా 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటుంది: గల్లా జయదేవ్
- పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం
- పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- హాజరైన గల్లా, కనకమేడల, రామ్మోహన్ నాయుడు తదితరులు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో ఆ పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబుతో చర్చించారు. ఈ సందర్భంగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడైనా 1 నుంచి 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన ఉంటుందని, కానీ ఏపీలో మాత్రం ప్రభుత్వం తిరోగమన పథంలో పయనిస్తోందని వ్యాఖ్యానించారు. ఏబీఎన్ చానల్ పై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేసే ప్రయత్నానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని చెప్పారు. మీడియా స్వేచ్ఛను హరించివేసేలా జగన్ సర్కారు తీసుకువచ్చిన జీవో అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ, జగన్ రివర్స్ నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ఉనికికే ప్రమాదం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ కనుమరుగయ్యే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఉనికిని ఎలా కాపాడుకోవాలో ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే జగన్ పాలనలోనే అత్యధిక నష్టం వాటిల్లిందని విమర్శించారు. అనాలోచిత నిర్ణయాలతో రాజధానిని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కనకమేడల మండిపడ్డారు.
యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల ద్వారా రాష్ట్ర పరిణామాలు దేశానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్రం జోక్యాన్ని కోరతామని స్పష్టం చేశారు.