Telangana: ఇక జీవన ప్రమాణ పత్రాలు మాన్యువల్ గా కూడా సమర్పించవచ్చు!
- సానుకూలంగా స్పందించిన అధికారులు
- ఈ సేవ కేంద్రాల్లో తప్పిన కష్టాలు
- ఈమేరకు త్వరలో ఉత్తర్వులు
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ పింఛనుధారులు ఇక ముందు తమ జీవన ప్రమాణ పత్రాలను మాన్యువల్ విధానంలో సమర్పించవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ కె. లక్ష్మయ్య మీడియాకు తెలిపారు. ప్రస్తుతం జీవన ప్రమాణ పత్రాలను ఈ సేవ లేదా మీ సేవ కేంద్రాల్లో పింఛనుదారులు అందిస్తున్నారన్నారు.
ఈ కేంద్రాల్లో సాంకేతిక సమస్యల మూలంగా పింఛనుదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. దీంతో మాన్యువల్ విధానంలో జీవన ప్రమాణ పత్రాల సమర్పణకు అంగీకరించాలని పింఛనుదారులు చేసిన విజ్ఞప్తి పట్ల అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. తాజా అనుమతితో పింఛనుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసేవ వద్ద క్యూలు సాంకేతిక సమస్యల మూలంగా కలిగే కష్టాలు తప్పాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.