tsrtc: నేటితో రికార్డులకెక్కనున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె!

  • నేటితో 43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె
  • రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
  • నేడు ‘బస్‌రోకో’ను ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ

వివిధ డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో రికార్డులకెక్కనుంది. నేటితో సమ్మె 43 రోజులకు చేరుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో జరిగిన సకల జనుల సమ్మె 42 రోజులు సాగింది. తెలంగాణలో సుదీర్ఘకాలంపాటు జరిగిన సమ్మెగా ఇప్పటి వరకు సకల జనుల సమ్మెకు గుర్తింపు ఉండగా, ఇప్పుడీ రికార్డును ఆర్టీసీ సమ్మె బద్దలుగొట్టింది. 2001లోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. అప్పట్లో సమ్మె 24 రోజులు కొనసాగింది. నేటితో 43వ రోజులోకి అడుగుపెట్టిన సమ్మె తెలంగాణ చరిత్రలో సుదీర్ఘకాలంపాటు జరిగిన సమ్మెగా రికార్డులకెక్కబోతోంది.

కాగా, నిన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్‌ శివారులోని తీగలగుట్టపల్లిలో కేసీఆర్‌ ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్మికులు గేటు వద్దే బైఠాయించి ధర్నాకు దిగారు. అలాగే, నిజామాబాద్,  నిర్మల్‌, భైంసా డిపోల్లోకి వెళ్లిన కార్మికులు బస్సులను అడ్డుకునేందుకు యత్నించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి.

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, నేడు నిరాహార దీక్షలకు దిగనున్నట్టు ఆర్టీసీ జేఏసీ ఇది వరకు ప్రకటించగా ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకుంది. నేడు ‘బస్ రోకో’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు  ఎక్కడికక్కడ 144 సెక్షన్‌ ను విధించాలని ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News