Vijay Sai Reddy: విపక్ష నేతల ఉద్యమాలపై మీ సెటైర్లు బాగున్నాయి కానీ, ఈ సవాల్ స్వీకరిస్తారా?: విజయసాయికి బుద్ధా కౌంటర్
- చంద్రబాబు, పవన్ లపై విజయసాయి వ్యాఖ్యలు
- ట్విట్టర్లో బదులిచ్చిన బుద్ధా వెంకన్న
- మీ సెటైర్లు కార్మికులకు కూడు పెట్టవని విమర్శలు
చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష, పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీటుగా బదులిచ్చారు. విపక్షనేతలు చేస్తున్న ఉద్యమాలపై మీ సెటైర్లు బాగానే ఉన్నాయి కానీ, మీ సెటైర్లు భవన నిర్మాణ కార్మికులకు పట్టెడన్నం కూడా పెట్టవని విమర్శించారు. కార్మికులకు పనులకు లోటు లేదు, వారు ఆత్మహత్యలు చేసుకుంటోంది వ్యక్తిగత కారణాలతో అంటూ అవమానకరంగా మాట్లాడడం ఇకనైనా మానుకోండి అంటూ హితవు పలికారు.
"మీ సీఎం జగన్ 30 లక్షల మంది నోళ్లు కొట్టారు, వారిని అప్పులపాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేశారు. మీ ధనదాహం తీరేదెప్పటికి?" అంటూ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. "దీక్ష చేసిన ఖర్చుతో వెయ్యి కుటుంబాలు ఏడాదిపాటు బతుకుతాయని సెలవిచ్చారు కదా, మరి ఎప్పట్లాగానే మీకో చిన్న సవాల్ విసురుతున్నాను. సీబీఐ చెప్పినట్టు మీరు దొబ్బిన రూ.43,000 కోట్లు రాష్ట్రానికి తిరిగి ఇవ్వండి. కనీసం సగం అప్పు అయినా తీరుతుంది. మేం ఒక్క రోజు దీక్షకి ఖర్చు చేసిన డబ్బు భవన నిర్మాణ కార్మికులకు ఇస్తాం. ఈ సవాల్ కు జగన్ గారు, విజయసాయి గారు సిద్ధమేనా?" అంటూ ట్వీట్ చేశారు.