RTC MD Sunil Sharma Affidavit submission: ఆర్టీసీ ఎండీ సమర్పించింది రాజకీయ అఫిడవిట్: అశ్వత్థామరెడ్డి
- 17నెలల క్రితం ఎండీ బాధ్యత చేపట్టిన సునీల్ శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసు?
- ఆయన కనీసం ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదు
- సీఎం తయారు చేసిన అఫిడవిట్ పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారు
సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ ఇన్ ఛార్జీ ఎండీ సునీల్ శర్మ అదనపు అఫడవిట్ దాఖలు చేయడంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. సునీల్ శర్మ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ రాజకీయ నాయకులు సమర్పించిన అఫిడవిట్ లా ఉందని విమర్శించారు. సమ్మె చట్టబద్ధమా.. విరుద్ధమా అనేది కోర్టు తేలుస్తుందని చెెప్పారు. కోర్టులు వాతలు పెట్టినా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు.
పదిహేడు నెలల క్రితమే ఎండీగా బాధ్యతలు చేపట్టిన సునీల్ శర్మకు ఆర్టీసీ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఆయన కనీసం ఏడు సార్లు కూడా కార్యాలయానికి రాలేదన్నారు. దీంతో ఆయన పరిష్కరించాల్సిన ఫైళ్లు కుప్పలుగా పేరుకుపోయాయని పేర్కొన్నారు. సీఎం తయారు చేసిన అఫిడవిట్ పై ఎండీ సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని.. కోర్టుకు సమర్పించింది రాజకీయ అఫిడవిటని ఆరోపించారు. సమ్మె వల్ల ఆర్టీసీ సంస్థ నష్టపోలేదని.. ప్రభుత్వ విధానాల మూలానే నష్టపోయిందని అన్నారు. సమ్మె లేనప్పుడు నష్టం వస్తుందని చెప్పిన ఎండీ, సమ్మె జరుగుతుంటే నష్టం వస్తోందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.