Guntur District: పల్నాడు తిరునాళ్లలో వివాదం... కొట్టుకున్న రెండు పార్టీల వర్గాలు!

  • దుర్గి మండలం ధర్మవరంలో తిరునాళ్ల
  • సాంఘిక నాటకంలో ఓ పార్టీ జెండా ప్రదర్శనతో వివాదం
  • పోలీసుల లాఠీచార్జ్ తో వ్యక్తికి గాయాలు

గుంటూరు జిల్లా పల్నాడు పరిధిలోని దుర్గి మండలం ధర్మవరం తిరునాళ్ల సందర్భంగా ప్రదర్శించిన సాంఘిక నాటకం హింసాత్మకంగా మారింది. నాటకం మధ్యలో స్టేజ్ పై ఓ పార్టీ జెండాను ప్రదర్శించగా, మరో పార్టీ వర్గీయులు అభ్యంతరం చెప్పడంతో వివాదం మొదలైంది. ఆపై రెండు రాజకీయ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగగా, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, లాఠీ చార్జ్ చేసి, వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జ్ లో మరో వ్యక్తికి గాయాలు కావడంతో, పోలీసులపై దాడికి దిగిన స్థానికులు వారిపై రాళ్లు రువ్వుతూ, వాహనాలు ధ్వంసం చేశారు. స్థానికుల దాడిలో ఎస్ఐతో పాటు హోమ్ గార్డుకు గాయాలు అయ్యాయి. ఆపై మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు, పోలీసుల కారణంగానే గొడవ పెరిగిందని ఆరోపించారు. గురజాల డీఎస్పీ ఘటనా స్థలికి వచ్చి, ఇరు వర్గాలకూ నచ్చజెప్పారు. ఘటనపై విచారణ జరిపిస్తామని, పోలీసుల తప్పుంటే శాఖా పరమైన చర్యలకు ఆదేశిస్తానని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News