Nawaz Sharef: నవాజ్ షరీఫ్ కు ఊరట... లండన్ వెళ్లేందుకు అనుమతి!
- అనారోగ్యంతో బాధపడుతున్న నవాజ్
- 4 వారాల పాటు బెయిల్ మంజూరు
- పొడిగించే అవకాశం ఉందన్న న్యాయవాది
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆయన లండన్ వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు అనుమతించింది. నాలుగు వారాల పాటు ఆయనకు బెయిల్ ను మంజూరు చేస్తున్నామని, ఈలోగా, చికిత్స చేయించచుకుని తిరిగి స్వదేశానికి రావాలని కోర్టు నిబంధన విధించింది. విదేశాలకు వెళ్లకుండా నిషేదం విధించిన వ్యక్తుల జాబితా నుంచి షరీఫ్ పేరును తొలగించాలని ఇమ్రాన్ సర్కారును కోర్టు ఆదేశించింది.
కాగా, వైద్యుల సలహా మేరకు ఈ గడువును మరింతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయని నవాజ్ తరఫు న్యాయవాది ఒకరు మీడియాకు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నవాజ్ షరీఫ్, లండన్ కు బయలుదేరి వెళతారని ఆయన తెలిపారు. శరీరంలోని పలు అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్న నవాజ్ రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో, ఆయన్ను జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.