Giriraj Singh: రాజకీయాల నుంచి తప్పుకునే సమయం వచ్చేసింది: కేంద్ర మంత్రి గిరిరాజ్ కీలక వ్యాఖ్యలు!
- రామాలయం నిర్మించే సమయం వచ్చేసింది
- జనాభా నియంత్రణ కూడా అమలైతే రిటైర్ మెంట్
- బీహార్ లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
తాను అనుకున్న రెండు లక్ష్యాల్లో ఒకటి నెరవేరే సమయం వచ్చేసిందని, మరొకటి కూడా నెరవేరితే, రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటానని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. బీహార్ లోని కతియార్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, అయోధ్యలో శ్రీరామునిది దేవాలయం, జనాభా నియంత్రణ తన కెరీర్ లో రెండు ప్రధాన లక్ష్యాలని ఆయన తెలిపారు. రామాలయం నిర్మించే సమయం వచ్చేసిందని, ఇది తనవంటి వృద్ధులు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని భావిస్తున్నానని, ఆపై రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలో పలుమార్లు జనాభా నియంత్రణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల కారణంగానే దేశంలో జనాభా పెరుగుతోందని, ఆ అంశమే తనను రాజకీయాలవైపు మళ్లించిందని ఆయన అంటుండేవారు.