Badrinath: నేడు బద్రీనాథ్ ఆలయం మూత... ఆరు నెలలు ఇక మంచులోనే!
- నేటి సాయంత్రం మూత
- ఇప్పటికే దట్టంగా కురుస్తున్న మంచు
- ఆరు నెలలు వెలగనున్న అఖండ జ్యోతి
హిమాలయ పర్వత సాణువుల్లో కొలువైన బద్రీనాథుని ఆలయం నేడు మూతపడనుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండటం, వచ్చే ఆరు నెలల పాటు ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోనున్న నేపథ్యంలో, ఈ సాయంత్రం సంప్రదాయ పూజల అనంతరం ఆలయాన్ని పూజారులు మూసివేయనున్నారు. తిరిగి వచ్చే సంవత్సరం వేసవి ప్రారంభమైన తరువాత ఆలయం తలుపులు తెరుస్తారు. కాగా, నేటి సాయంత్రం వెలిగించే అఖండ జ్యోతి, ఈ ఆరు నెలలూ గర్భగుడిలో వెలుగుతూనే ఉంటుంది. దీన్ని బద్రీనాథుని మహిమగా భక్తులు నమ్ముతుంటారు. ఇక సీజన్ చివరి రోజు కావడంతో ఆదివారం నాడు స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.