devineni: సీబీఐ అధికారులు చిటిక వేస్తే వైసీపీ పరిస్థితి ఏంటీ?: దేవినేని ఉమ
- కార్మికుల పక్షాన చంద్రబాబు దీక్ష చేశారు
- దీక్షను అపహాస్యం చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు
- 70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నిరాహార దీక్ష చేశారు
- టీడీపీని స్టోర్ రూమ్ లో పెట్టడం ఎవరి వల్లా కాదు
వైసీపీ నేతలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ అధికారులు చిటిక వేస్తే వైసీపీ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నించారు. వారు జైలుకి వెళ్లాల్సిందేనని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల పక్షాన చంద్రబాబు దీక్ష చేస్తే అపహాస్యం చేసేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నిరాహార దీక్ష చేశారని కొనియాడారు.
టీడీపీని స్టోర్ రూమ్ లో పెట్టడం ఎవరి వల్లా కాదని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీకి అధికారం ఉండడం, ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదని చెప్పుకొచ్చారు. మాతృభాషను కాపాడాలని మేధావులు సూచిస్తుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదని అన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించిన వారిని మంత్రులు బెదరిస్తున్నారని, వ్యక్తిగత కక్షలతోనే ప్రాజెక్టుల నుంచి గుత్తేదారులను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం చాలా సార్లు చెప్పినప్పటికీ, రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయట్లేదని అన్నారు.