sanjay raut: బాల్ థాకరేకు మాటిచ్చాం.. మహారాష్ట్రకు సీఎంగా శివసేన నేతే ఉంటారు: సంజయ్ రౌత్
- నేడు బాల్ థాకరే ఏడవ వర్ధంతి
- బాలాసాహెబ్ కోసం మేము ఏమైనా చేస్తాం
- మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుంది
శివసేనకు చెందిన నేతను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా చేస్తామని తమ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు ఇచ్చిన మాటను నిలుపుకుంటామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఈ రోజు బాల్ థాకరే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు మహారాష్ట్ర రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ... 'బాలాసాహెబ్ కోసం మేము ఏమైనా చేస్తాం. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడుతుంది. మా పార్టీ నేత రాష్ట్రానికి సీఎంగా ఉంటారని ఉద్ధవ్ థాకరే గతంలో బాలాసాహెచ్ కు మాటిచ్చారు. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు.. మీరు త్వరలోనే చూస్తారు' అని అన్నారు.
కాగా, బాల్ థాకరే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆయన కుమారుడు, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పాటు బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు. ఓ ఆంగ్ల పత్రికలో కార్టూనిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన బాల్ థాకరే అనంతరం శివసేనను స్థాపించారు. 2012, నవంబరు 17న బాల్ థాకరే కన్నుమూశారు.