Rajyasabha: ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొనడం నా అదృష్టం: రాజ్యసభలో ప్రధాని మోదీ

  • రాజ్యసభ 250వ సమావేశం 
  • రాజ్యసభ సభ్యులందరికీ మోదీ శుభాకాంక్షలు
  • అనేక విషయాలను కొత్తకోణంలో చూసే అదృష్టం  కలిగిందన్న మోదీ

రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా రాజ్యసభ సభ్యులందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎగువసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న మోదీ చెబుతూ, ఈ మహోన్నత ఘట్టంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అనేక విషయాలను కొత్తకోణంలో చూసే అదృష్టం తనకు కలిగిందని  సంతోషం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో నాడు ఒక సభ ఉండాలా? రెండుగా ఉండాలా? అనే అంశంపై రాజ్యాంగసభలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. దేశానికి దిశానిర్దేశం చేసే పని తొలుత చేపట్టింది రాజ్యసభే అని, ఆ తర్వాతే లోక్ సభ అని అన్నారు. భారత సమాఖ్య విధానానికి రాజ్యసభ ఆత్మ వంటిదని అభిప్రాయపడ్డారు.
 
కాలమాన పరిస్థితులతో పాటు మారేందుకు రాజ్యసభ కృషి చేసిందని ప్రశంసించారు. రాజ్యసభ చరిత్ర సృష్టించిందని, చరిత్ర మార్చడంలో తన వంతు కృషి చేసిందని కొనియాడారు. నిష్ణాతుల అనుభవాలు దేశానికి ఉపయోగపడేలా ఈ సభ సహకరిస్తుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్ల దేశానికి ఎంతో మేలు కల్గిందని ప్రశంసించిన మోదీ, మన ఆలోచనలే ఉభయసభల ఔన్నత్యాన్ని చాటుతాయని భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారని గుర్తుచేసుకున్నారు. రాధాకృష్ణన్ మాటల విలువను తగ్గిస్తున్నామా, పెంచుతున్నామా అనేది గుర్తించాలని కోరారు.

  • Loading...

More Telugu News