Guntur District: అప్పు తీసుకున్నందుకు లైంగిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగిని!
- ఫైనాన్షియర్ల వద్ద నుంచి రూ. 3 లక్షల రుణం
- ఇప్పటికే రూ. 8 లక్షలు తీసుకున్న నిందితులు
- బాధితురాలికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స
తీసుకున్న రుణం చెల్లించినప్పటికీ లైంగికంగా వేధిస్తుండడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గుంటూరులో జరిగిందీ ఘటన. నిన్న ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో బాధితురాలు తన గోడు చెప్పుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది.
పోలీసులకు ఆమె చేసిన ఫిర్యాదు ప్రకారం.. బాధితురాలు తన కుమారుడి చదువు కోసం నరసరావుపేటకు చెందిన ఇద్దరు ఫైనాన్షియర్ల వద్ద మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఇందులో భాగంగా వారికి ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి ఇచ్చింది. తీసుకున్న అప్పు చెల్లించే నిమిత్తం ప్రతి నెల ఆమె రూ.15 వేలు చెల్లిస్తోంది. అయినప్పటికీ బాధితురాలి ఇంటికి వెళ్లిన ఫైనాన్షియర్లు ఆమె ఏటీఎం కార్డును తీసుకెళ్లారు. అప్పు మొత్తం తీరాక ఏటీఎం కార్డు ఇస్తామని చెప్పిన వారు ప్రతి నెల రూ. 30 వేలు చొప్పున రెండున్నర సంవత్సరాలు డబ్బులు డ్రా చేసుకున్నారు.
అలా వారు డ్రా చేసుకున్న డబ్బులు రూ.8 లక్షలు అయింది. ఇదే విషయాన్ని ఆమె ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, తీసుకున్న డబ్బులు చెల్లిస్తే సరిపోదని, తమ కోరిక కూడా తీర్చాలంటూ రాత్రి వేళ ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపులు భరించలేని ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారి బారి నుంచి తనను కాపాడాలని, వారి వద్ద ఉన్న చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.