Ramdas Athawale: బీజేపీ-శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు కొత్త ఫార్ములా చెప్పిన రాందాస్ అథవాలే
- సీఎం పదవి బీజేపీకి మూడేళ్లు, శివసేనకు రెండేళ్లు
- ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ కు చెప్పానన్న అథవాలే
- బీజేపీతో కూడా ఇదే అంశంపై చర్చిస్తానంటూ వ్యాఖ్య
ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన, ఎన్సీపీలను ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానించినప్పటికీ... ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేనల మధ్య సీఎం పదవి పంపకం విషయంలో తలెత్తిన వివాదం చివరకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకంగా మారింది. మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ లు సంకీర్ణంగా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్నప్పటికీ... ఇంతవరకు చర్చలు కూడా పూర్తి కాలేదు.
ఈ నేపథ్యలో ఎన్డీయే భాగస్వామి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. తాను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తో మాట్లాడానని, బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై ఆయనను ఒప్పించేందుకు యత్నించానని చెప్పారు. సీఎం పదవిని మూడేళ్లు బీజేపీ, రెండేళ్లు శివసేన పంచుకునేలా ఓ ఫార్ములాను ఆయన ముందు ఉంచానని తెలిపారు. బీజేపీతో కూడా ఇదే అంశంపై మాట్లాడబోతున్నానని చెప్పారు.
ఈ ఫార్ములాకు బీజేపీ అంగీకరిస్తే, ప్రభుత్వ ఏర్పాటు విషయమై శివసేన ఆలోచించాలని అథవాలే సూచించారు. తన సూచనకు బీజేపీ, శివసేనలు అంగీరిస్తాయనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా తాను మాట్లాడానని... తమరు మధ్యవర్తిత్వం వహిస్తే, ఈ సమస్య నుంచి గట్టెక్కగలమనే విషయాన్ని ఆయనకు చెప్పానని తెలిపారు.