Maharashtra: ఇప్పటి బీజేపీ నేతలు పుట్టకముందే శివసేన 'హిందుత్వ'కు మద్దతుగా నిలిచింది: సామ్నా
- ఓ కొలిక్కిరాని మహారాష్ట్ర రాజకీయం
- తమను ఎన్డీయే నుంచి తొలగించారంటూ శివసేన ఆగ్రహం
- సామ్నాలో సంపాదకీయం
మహారాష్ట్ర రాజకీయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా, ఎన్డీయే నుంచి తమను తొలగించారంటూ శివసేన రాద్ధాంతం చేస్తోంది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈమేరకు నిప్పులు చెరిగింది. ప్రస్తుతం బీజేపీలో చక్రం తిప్పుతున్న నాయకులు పుట్టకముందే శివసేన హిందుత్వ సిద్ధాంతాలకు వెన్నుదన్నుగా నిలిచిందని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. తమను ఎన్డీయే నుంచి తొలగించడానికి వాళ్లెవరు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్వానీ, వాజ్ పేయి, బాదల్, జార్జి ఫెర్నాండెజ్ లతో కలిసి బాలా సాహెబ్ థాకరే ఎన్డీయేకు రూపకల్పన చేశారని, ఇప్పటి బీజేపీ నేతలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్, ఎన్సీపీతో చర్చలు జరుపుతున్నందునే ఎన్డీయే నుంచి తొలగిస్తున్నట్టు చెప్పడం పట్ల శివసేన మండిపడింది. అది కూడా బాలా సాహెబ్ థాకరే వర్ధంతి రోజునే ఈ నిర్ణయం వెలిబుచ్చడం దారుణమని అభిప్రాయపడింది. గతంలో మోదీకి ఎవరూ అండగా నిలవని కాలంలో ఒక్క శివసేన మాత్రమే తోడుగా నిలిచిందని ఆ పార్టీ అధినాయకత్వం గుర్తుచేసింది.