East Godavari District: సెల్ఫీకి రూ.50.. బతుకుదెరువు కోసం ఓ కళాకారుడి వినూత్న ఆలోచన
- ఎల్ఎల్బీ చదువుకున్న నూకాజీ
- నాటకాలంటే ప్రాణం
- రోజుకు వెయ్యి రూపాయల సంపాదన
ఎల్ఎల్బీ వరకు చదువుకున్న నూకాజీకి నాటకాలంటే ప్రాణం. కానీ ఇప్పుడు నాటకాలకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ అతడికి నాటకాలపై ప్రేమ తగ్గలేదు. బతుకుదెరువు కోసం తుని నుంచి హైదరాబాద్కు చేరుకున్న నూకాజీ తనకొచ్చిన నాటకాన్నే నమ్ముకున్నాడు. వివిధ వేషధారణలతో నగరంలో తిరుగుతూ, వినూత్న ఆలోచనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆంజనేయస్వామిగా, క్రికెటర్గా, రాముడిగా.. ఇలా నచ్చిన వేషాలు ధరిస్తూ రోడ్డుపై కనిపిస్తుంటాడు. అంతేకాదు, తనతో సెల్ఫీ దిగాలంటే రూ.50 చెల్లించాలంటూ మెడలో ఓ బోర్డు కూడా తగిలించుకున్నాడు. డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకుంటాడు.
అతడిని చూసి ముచ్చటపడిన కొందరు నూకాజీతో సెల్ఫీ దిగి రూ.100, రూ.200, రూ.500 కూడా ఇస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు నూకాజీ చెప్పాడు. వచ్చే ఏడాది పెళ్లికి సిద్ధమవుతున్న నూకాజీ తనతో సెల్ఫీ దిగి డబ్బులిచ్చి సహకరించాలని కోరుతున్నాడు.