Indira Gandhi: ఇందిరాగాంధీ జన్మించిన 'ఆనంద్ భవన్'కు రూ. 4.35 కోట్ల ఇంటిపన్ను నోటీసులు
- నోటీసులు పంపించిన ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్
- 2013 నుంచి పెండింగ్ లో ఉన్న ట్యాక్స్ చెల్లింపులు
- ప్రాపర్టీ ట్యాక్స్ నిబంధనల ప్రకారం నోటీసులిచ్చామన్న అధికారి
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మించిన ఆనంద్ భవన్ కు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ. 4.35 కోట్లకు హౌస్ ట్యాక్స్ నోటీసులు పంపించారు. ఇందిర జన్మించిన ఆనంద్ భవన్ ప్రయాగ్ రాజ్ లో ఉంది. ప్రస్తుతం ఈ భవనం నాన్ రెసిడెన్సియల్ కేటగిరీ కింద ఉంది. 2013 నుంచి ఈ భవంతికి హౌస్ ట్యాక్స్ చెల్లించలేదని మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
ఆనంద్ భవన్ ను జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ట్యాక్స్ అసెస్ మెంట్ అధికారి పీకే మిశ్రా మాట్లాడుతూ, ప్రాపర్టీ ట్యాక్స్ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశామని తెలిపారు. ట్యాక్స్ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని గతంలో తాము సూచించినప్పటికీ... వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో, చివరకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.