Visakhapatnam District: ఫేస్‌బుక్‌లో మాయలేడి వలలో పడ్డ వృద్ధుడు.. రూ.34 లక్షలు సమర్పయామి!

  • ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను ఓకే చేసి మూల్యం చెల్లించుకున్న వృద్ధుడు
  • విదేశాల నుంచి గిఫ్ట్ పేరుతో రూ.34 లక్షలు టోకరా
  • ఇద్దరు నిందితుల అరెస్ట్

ఫేస్‌బుక్‌లో పరిచయమైన మాయలేడి వలలో చిక్కిన ఓ వృద్ధుడు ఏకంగా రూ.34 లక్షలు వదిలించుకున్నాడు. చివరికి మోసపోయినట్టు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. విశాఖపట్టణంలో జరిగిందీ ఘటన. సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. ఎంఎంటీఎస్‌లో పనిచేసి రిటైరైన సోమిర్ కుమార్ దాస్‌కు ఓ రోజు ఫేస్‌బుక్ నుంచి ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.

ఎన్నే రోజ్ అనే మహిళ నుంచి వచ్చిన ఆ రిక్వెస్ట్‌ను కుమార్ దాస్ ఓకే చేశాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగింది. వ్యక్తిగత విషయాలను, ఆర్థిక వ్యవహారాలను పంచుకునే స్థాయి వరకు వారి పరిచయం వెళ్లింది. తాను విదేశాల్లో ఉంటానని మహిళ చెప్పింది. నమ్మకంగా మాట్లాడుతూ క్రమంగా కుమార్ దాస్‌ను తన వలలో పడేలా చేసింది. ఈ క్రమంలో తాను రిటైరయ్యానని కుమార్ దాస్ చెప్పడంతో తాను గిఫ్ట్ పంపిస్తానని చెప్పింది.

ఈ క్రమంలో ఓ రోజు విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామంటూ బాధితుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని, వాటిని తీసుకోవాలంటే తొలుత కస్టమ్స్ డ్యూటీ కింద కొంతమొత్తం చెల్లించాల్సి ఉంటుందని ఫోన్ చేసిన వ్యక్తులు తెలిపారు. నిజమే కాబోలని నమ్మిన వృద్ధుడు తన ఖాతా వివరాలు చెప్పడంతోపాటు రూ.34 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు.

డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాక గానీ కుమార్ దాస్‌కు తత్వం బోధపడలేదు. ఫోన్ నంబరుకు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండడంతో నెమ్మదిగా అనుమానం మొదలైంది. ఫేస్‌బుక్‌‌లో వెతికితే ఎన్నే రోజ్ ఖాతా క్లోజ్ అని చూపించింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన కుమార్ దాస్ విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇదంతా సైబర్ నిందితుల పనేనని తేల్చారు. ఢిల్లీ నుంచి ఈ వ్యవహారం నడిచినట్టు గుర్తించి అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  

  • Loading...

More Telugu News