Bhimavaram: పేకాట ఆడేందుకు భీమవరం జూదరుల సరికొత్త ప్లాన్... పట్టేసిన పోలీసులు!
- కొత్త పద్ధతులు ఎంచుకుంటున్న పేకాటరాయుళ్లు
- ఏర్లు, నదీ పాయల్లో సరికొత్త క్లబ్ లు
- పశ్చిమ గోదావరి జిల్లాలో నయా దందా
జూద ప్రియులు సాధారణంగా ఏ క్లబ్బులకో చేరిపోయి, తమ వాంఛను తీర్చుకుంటుంటారు. అదే ఉభయ గోదావరి జిల్లాలైతే, శివారు ప్రాంతాల్లోని తోటలను, ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పేకాట శిబిరాలను ఆశ్రయిస్తుంటారు. వీటి గురించి అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు సమాచారం ఉండదు. కానీ, ఇటీవలి కాలంలో పేకాటరాయుళ్లు కొత్త పద్ధతులు వినియోగిస్తూ, ఎవరికీ తెలియని ప్రాంతాల్లో మకాం వేస్తున్నారు. పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఏర్లు, నదులను పేకాట స్థావరాలుగా మార్చేశారు. భీమవరం పరిసర మండలాల నుంచి మొగల్తూరు వరకు విస్తరించిన ఉప్పుటేరులో చిన్న చిన్న మర పడవల్లో ప్రయాణిస్తూ, జూదం ఆడుతున్నారు.
కానీ, దాన్ని కూడా పోలీసులు పట్టేశారు. ఈ నెల 12న కాళ్ళ మండలం మోడి గ్రామ పరిధిలో పడవలో పేకాడుతున్న వారు పోలీసులకు పట్టుబడడం, ఆపై వారు వెల్లడించిన విషయాలతో, పడవల్లో పేకాట ఆడుతున్న విషయం వెలుగు చూసింది. జిల్లాలోని క్లబ్బులు మూత పడటంతో కొత్త ప్రాంతాలు వెతికిన జూదరులకు కాలువలు కనిపించాయి. పడవలపై రోజంతా ఏటి మధ్యలోనే ఉంటూ జూదం ఆడటంతో పాటు, వాటి యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుని, ఆహారం, మద్యం సరఫరా చేయించుకుంటున్నారు.
కాళ్ళ మండలంలో ఉన్న మొగదిండి స్ట్రెయిట్ కట్ తో పాటు, భీమవరం సమీపంలోని ఏరు జూదం ఆడడానికి అనువుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ పేకాడేందుకు కృష్ణా జిల్లా నుంచి కూడా వస్తున్నారు. వీరంతా తెలివిగా, నిత్యమూ ఒకే ప్రాంతంలో కాకుండా రోజుకో చోట పడవలను ఆపించుకుని ఎవరికీ అనుమానం రాకుండా తమ దందాను సాగిస్తున్నారు.
ఇక మొదదిండి డ్రెయిన్ లో పేకాట రాయుళ్లు పట్టుబడిన తరువాత, పోలీసులు తీరం వెంబడి గస్తీ పెంచారు. ఇక్కడ పట్టుబడిన వారిలో అధికార పార్టీ నాయకులు, గతంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తూ దొరికిపోయిన వారు కూడా ఉండటం గమనార్హం. దీంతో అప్రమత్తమైన పోలీసులు, కాలువలు, ఏరుల్లోకి వెళ్లే బోట్లను తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏర్లు, నదుల మధ్యలోకి సాధారణ ప్రజలు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు అంటున్నారు.