Jagan: డిక్లరేషన్ పై మాట్లాడితే ఇంకా ఎక్కువ తిడతా: కొడాలి నాని
- తిరుమల సన్నిధిలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటూ విమర్శలు
- చంద్రబాబు, తదితరులపై కొడాలి నాని ఫైర్
- మరోసారి అదే తరహా వ్యాఖ్యలు!
ఏపీ సీఎం జగన్ తిరుమల ఆలయ సన్నిధిలో ప్రవేశించినప్పుడు అన్యమతస్తుడిగా డిక్లరేషన్ పై సంతకం చేయాలంటూ తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రమైన పదజాలంతో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఓసారి ఆయన చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించారు. జగన్ ను డిక్లరేషన్ అడిగే హక్కు చంద్రబాబుకు ఎక్కడిదని ప్రశ్నించారు.
జగన్ తిరుమల వెళ్లడం ఇదేమీ కొత్త కాదని, పాదయాత్రకు ముందు, ఆ తర్వాత కూడా వెళ్లారని వివరించారు. అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబేనని, అప్పుడు గుర్తుకు రాని డిక్లరేషన్ ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని మండిపడ్డారు. మరోసారి డిక్లరేషన్ గురించి మాట్లాడితే ఈసారి ఇంకా ఎక్కువ తిడతానని హెచ్చరించారు. వెంకన్న తమ కులదైవం అని చెప్పుకునే చంద్రబాబు తన కొడుక్కి, మనవడికి ఎందుకని వెంకన్న పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వెంకన్న ఆలయానికి వెళ్లాలంటే టీడీపీ, బీజేపీ సభ్యత్వాలు తీసుకోవాలా? అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.