West Indies: వెస్టిండీస్ తో వన్డే, టి20 సిరీస్ లకు టీమిండియా ఎంపిక... కొత్త ముఖాల్లేవ్!
- కోల్ కతాలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ
- డిసెంబరు 6 నుంచి భారత్ లో విండీస్ పర్యటన
- 3 టి20లు, 3 వన్డేలు ఆడనున్న కరీబియన్లు
వెస్టిండీస్ తో త్వరలో సొంతగడ్డపై జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ లకు టీమిండియాను ఎంపిక చేశారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన కోల్ కతాలో సమావేశమైన టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు వన్డే, టి20 సిరీస్ లకు వేర్వేరుగా జట్లను ప్రకటించింది. అయితే, వన్డే జట్టులో స్థానం దక్కించుకున్న కేదార్ జాదవ్ టి20 జట్టులో లేడు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. ఇదొక్క మార్పు తప్ప రెండు జట్లలో మరే ఇతర మార్పు లేదు. ఈసారి కొత్త ఆటగాళ్లెవరినీ ఎంపిక చేయలేదు.
బంగ్లాదేశ్ తో టి20 సిరీస్ లో ఆడిన హార్డ్ హిట్టర్ శివం దూబేకు మరో అవకాశం ఇచ్చారు. రెండు ఫార్మాట్లలోనూ కోహ్లీనే కెప్టెన్. అంతేకాదు, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై సెలెక్టర్లు మరోమారు నమ్మకం ఉంచారు. అతడే తమ ప్రధాన వికెట్ కీపర్ అని వెల్లడిస్తూ రెండు ఫార్మాట్లకూ ఎంపిక చేశారు. డిసెంబరు 6 నుంచి భారత్ లో విండీస్ పర్యటన షురూ కానుంది. ఈ టూర్ లో భాగంగా 3 టి20 మ్యాచ్ లు, 3 వన్డేలు జరగనున్నాయి.