Akhilapriya: అక్కలు అఖిలప్రియ, మౌనికలపై కేసు పెట్టిన జగత్ విఖ్యాత్ రెడ్డి!
- హైదరాబాద్ లో భూ వివాదం
- భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలోనే భూమి అమ్మకం
- అప్పట్లో తాను మైనర్ నని, ఇప్పుడు వాటా కావాలని కోరుతున్న జగత్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అఖిలప్రియ, ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై స్వయంగా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కేసు పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ భూమిపై గత కొంత కాలంగా ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో తన ఇద్దరు అక్కలు అఖిలప్రియ, మౌనికారెడ్డిలకు వ్యతిరేకంగా జగత్ విఖ్యాత్ కోర్టును ఆశ్రయించారు. అఖిలప్రియపై రంగారెడ్డి అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఆయన కేసు వేశారు.
కాగా, వీరి తండ్రి భూమా నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలోనే ఈ భూమి అమ్మకాలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ భూమిలో తనకు కూడా వాటా కావాలని డిమాండ్ చేస్తున్న జగత్ విఖ్యాత్ రెడ్డి, ఆ భూమిని విక్రయించిన సమయానికి తాను మైనర్ నని, తన వేలి ముద్ర చెల్లదని వాదిస్తున్నారు.
ఆ పత్రాలపై తనకు తెలియని వయసులో వేసిన వేలిముద్రలు ఎలా చెల్లుతాయని, ఇప్పుడు న్యాయంగా తనకు రావాల్సిన వాటాను ఇప్పించాలని ఆయన న్యాయమూర్తిని, తన పిటిషన్ లో అభ్యర్థించారు. ఇద్దరు అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఓ ప్రముఖ కుటుంబంలో ఇలా విభేదాలు పొడచూపడం, సొంత అక్కలపైనే తమ్ముడు కేసు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.