fadnavis: మెజార్టీ నిరూపించుకుంటామంటూ బీజేపీ ధీమా.. 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వ్యాఖ్య
- వారం రోజుల్లో అసెంబ్లీలో బలనిరూపణ
- ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చారంటోన్న బీజేపీ
- గవర్నర్ కోష్యారీకి అజిత్ పవార్ లేఖ ఇచ్చారని వివరణ
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో అసెంబ్లీలో బలనిరూపణ ఎదుర్కోవాల్సి ఉండడంతో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ అంటోంది. తమ ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకుంటుందని కొందరు నేతలు మీడియాకు తెలిపారు.
ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తున్నట్లు గవర్నర్ కోష్యారీకి అజిత్ పవార్ లేఖ ఇచ్చారని వివరించారు. ప్రస్తుతం ఎన్సీపీ శాసనసభా పక్షనేతగా అజిత్ పవార్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ఎన్సీపీ నేతలు నిజంగానే బీజేపీకి మద్దతు తెలుపుతారా? అన్న సందిగ్ధత ఉంది.
స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాతే తన అనుకూల ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో ఆ పార్టీ అధినేత శరద్ పవార్ మీడియాతో మాట్లాడి పలు వివరాలు వెల్లడించి, తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. దాంతో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.