save RTC: ఆర్టీసీని రక్షించండంటూ.. పలుచోట్ల కార్మికుల నిరసన

  • ప్రభుత్వానికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • వరంగల్ లో కార్మికుల ర్యాలీ
  • పరిగిలో బస్సులను అడ్డుకున్న కార్మికుల అరెస్టు

ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు నిరసనలు చేపట్టారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వరంగల్, సంగారెడ్డి , వికారాబాద్ జిల్లాల పరిధుల్లోని పలు డిపోల వద్ద కార్మికులు ప్రదర్శనలు చేపట్టారు. సేవ్ ఆర్టీసీ.. ఆర్టీసీ బచావో అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ డిపో 1 నుంచి ఏకశిలా పార్కు వరకు ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ లో ఆర్టీసీ బచావో అంటూ కార్మికులు ఆందోళన చేపట్టారు.  

కాగా పరిగి డిపో డ్రైవర్ వీరభద్రయ్య మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ వికారాబాద్ జిల్లా బంద్ కు పిలుపు నిచ్చింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో డిపో ఎదుట కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. డిపో నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకోవడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News